ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్
- విఘ్నాలు తొలగి ప్రతి ఇంటా సుఖసంతోషాలు, సమృద్ధి నిండాలని ఆకాంక్ష
- పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులనే పూజిద్దాం: మంత్రి కందుల దుర్గేష్ పిలుపు
నిడదవోలు / అమరావతి:
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ రాష్ట్ర ప్రజలకు, నిడదవోలు నియోజకవర్గ ప్రజానీకానికి, కూటమి శ్రేణులకు హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విఘ్నాలను తొలగించి విజయాలను ప్రసాదించే ఆ విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖశాంతులు, ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం, సమృద్ధి వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తోందని, ఆ వినాయకుని కృపతో రాష్ట్రం మరింత సుభిక్షంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల విశిష్టతను చాటిచెప్పే వినాయక చవితి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణను ప్రధాన బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) విగ్రహాలకు బదులు పర్యావరణహిత మట్టి వినాయకులనే ప్రతిష్ఠించి పూజించాలని విజ్ఞప్తి చేశారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని శ్రీ కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు.
