జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: కండరాల క్షీణత (మస్క్యులర్ డిస్ట్రోఫీ) బారిన పడిన బాధితులను చిన్నతనంలోనే గుర్తించి తగిన చికిత్స అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకురాలు శోభారాణి సుంకర వెలగపూడి సచివాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 30వ తేదీన మంగళగిరిలోని గోపు గ్రాండ్ వేదికగా జరగనున్న ‘సాహస్-2026’ (వీల్స్ ఆఫ్ కరేజ్) కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా మంత్రికి ఆమె ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ కార్యక్రమంలో మస్క్యులర్ డిస్ట్రోఫీ వ్యాధితో బాధపడుతున్న బాధితుల కోసం 130 అత్యాధునిక ఎలక్ట్రిక్ వీల్ చైర్లను పంపిణీ చేయనున్నట్లు శోభారాణి వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ స్వయంగా దివ్యాంగురాలైనప్పటికీ తోటి బాధితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు శోభారాణి సుంకర చేస్తున్న నిరంతర కృషి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. తీవ్రమైన కండరాల క్షీణతతో సతమతమవుతున్న వారికి భరోసానిస్తూ, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ఆమె చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఎంతగానో అభినందనీయమని ప్రశంసించారు.
చిన్న వయసులోనే వ్యాధి లక్షణాలను గుర్తిస్తే తగిన ముందస్తు నివారణ చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. బాధితులకు చేయూతనిచ్చే మహత్తర లక్ష్యంతో ముందుకు వెళ్తున్న సంస్థలకు ప్రభుత్వం, స్వచ్ఛంద సేవా సంస్థలు, దాతలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. అందరూ సమష్టిగా పనిచేస్తేనే ఈ ఆరోగ్య సవాలును సమర్థవంతంగా అధిగమించవచ్చని ఆయన పేర్కొన్నారు. అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ద్వారా అందుతున్న విశేష సేవలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సైతం ప్రత్యేకంగా పరిశీలించారని మంత్రి తెలిపారు.
సమాజంలోని బలహీన వర్గాలు, దివ్యాంగుల సంక్షేమం కోసం శోభారాణి చేస్తున్న బృహత్తర ప్రయత్నాలు సంపూర్ణ సత్ఫలితాలనివ్వాలని మంత్రి దుర్గేష్ ఆకాంక్షించారు. బాధితులకు స్వతంత్ర జీవనాన్ని అందించేందుకు ఉద్దేశించిన ఎలక్ట్రిక్ వీల్ చైర్ల పంపిణీ కార్యక్రమం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆమె భవిష్యత్తులో మరిన్ని గొప్ప సేవా మైలురాళ్లను చేరుకోవాలని ఆకాంక్షించారు.
Slug: minister-kandula-durgesh-praises-sobharani-sunkara-muscular-dystrophy-sahas-2026
