జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చేపడుతున్న చర్యలు అభినందనీయమని అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు. పల్లె పండుగ మూడో విడత కార్యక్రమంలో భాగంగా మోపిదేవి మండలంలో వివిధ గ్రామాల మధ్య ప్రధాన రహదారుల నిర్మాణానికి భారీగా నిధులు మంజూరు కావడంపై స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. టేకుపల్లి నుంచి అయోధ్య వయా మేళ్లమర్రు, రజాపురం నుంచి కుమ్మరిపాలెం మరియు పెదకళ్లేపల్లి ప్రాంతాలలోని రోడ్ల అభివృద్ధికి కోట్ల రూపాయలు మంజూరు కావడంతో ఆయా గ్రామాల ప్రజలు ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు.
మోపిదేవి మండలంలోని టేకుపల్లి, మేళ్లమర్రు, పెదకళ్లేపల్లి, అయోధ్య, కుమ్మరిపాలెం మరియు అడపావారిపాలెం గ్రామాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు స్థానిక ప్రజలు, మహిళలు, జనసేన శ్రేణులు ఘనంగా పాలాభిషేకాలు నిర్వహించారు. సుదీర్ఘకాలంగా అధ్వానంగా మారిన రహదారుల సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ చూపిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వీబీజీ రాంజీ పథకం ద్వారా నియోజకవర్గానికి పన్నెండు కోట్ల రూపాయల నిధులు కేటాయించబడటంతో, దెబ్బతిన్న రోడ్లకు మహర్దశ పట్టనుందని నియోజకవర్గ నాయకులు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన పల్లెలు కూటమి ప్రభుత్వంలో మళ్లీ అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
అడపావారిపాలెంలో నిర్వహించిన సభలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ గత పాలకులు నగరాల అభివృద్ధిపై పెట్టిన శ్రద్ధను పల్లెలపై పెట్టకపోవడంతో గ్రామాలు వృద్ధుల కేంద్రాలుగా మారే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి ఒడిలో ప్రశాంత జీవనం సాగించే పల్లెసీమలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే ఈ నూతన రహదారుల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు నిర్వహించి పనులను వేగవంతంగా పూర్తి చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తోట కనకదుర్గ, మోపిదేవి మండల జనసేన పార్టీ అధ్యక్షులు పూషడపు రత్నగోపాల్ తదితరులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు.
Slug: mopidevi-mandal-roads-pawan-kalyan-funds-mandali-buddha-prasad
