జన గళం ఎడ్యుకేషన్ డెస్క్: ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు అండగా నిలుస్తూ వారిలో నైపుణ్యాలను ప్రాథమిక దశ నుంచే పెంపొందించే లక్ష్యంతో గుడివాడలో ఎన్ఎంఎంఎస్ స్కాలర్ యాప్ ఘనంగా ఆవిష్కృతమైంది. గుడివాడ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో శనివారం జరిగిన ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఎఫిసెన్స్ సిస్టమ్స్ రూపొందించిన ఈ విద్యా యాప్‌ను స్థానిక శాసనసభ్యులు, ఎఫిసెన్స్ ఫౌండర్ వెనిగండ్ల రాము మరియు సంస్థ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ వెనిగండ్ల సుఖద దంపతులు లాంఛనంగా ప్రారంభించారు. వందలాది మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఆధునిక సాంకేతికతను చేరువ చేసి నైపుణ్యంతో కూడిన ఫ్యూచర్ గుడివాడను నిర్మించడమే తమ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు. జీవితంలో ఎదురయ్యే తొలి ముఖ్యమైన పోటీ పరీక్షను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనేలా ఈ యాప్ విద్యార్థులకు ఒక దిక్సూచిలా పనిచేస్తుందని ఆయన వివరించారు.
జాతీయ ప్రతిభ ఆధారిత స్కాలర్‌షిప్ సాధించేందుకు వీలుగా ఈ యాప్‌లో సమగ్రమైన స్టడీ మెటీరియల్, ప్రాక్టీస్ టెస్టులు, పరీక్షా విధానంపై అవగాహన కల్పించే ప్రత్యేక కంటెంట్‌ను పొందుపరిచారు. ఈ ఉపకార వేతనం ద్వారా అర్హులైన విద్యార్థులు తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏటా పన్నెండు వేల రూపాయల ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉంది. అయితే కేవలం స్కాలర్‌షిప్ సాధించడమే కాకుండా విద్యార్థుల్లో తార్కిక ఆలోచన, సృజనాత్మకత, సమస్య పరిష్కార సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఎఫిసెన్స్ నిపుణులు ఈ యాప్‌ను అత్యంత శాస్త్రీయంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో దాగిన అద్భుతమైన ప్రతిభను వెలికితీసి వారికి మెరుగైన అవకాశాలు కల్పించాలనే ఉదాత్త ఆశయంతోనే ఈ వేదికను సిద్ధం చేసినట్లు ఎఫిసెన్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సుఖద సభాముఖంగా వెల్లడించారు.
విద్యార్థుల అభ్యాసానికి ఆధునిక టెక్నాలజీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో తొలిసారిగా విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తూ ఉన్నత ప్రమాణాలతో కూడిన యాప్‌ను తీసుకురావడం పట్ల ఆయన నిర్వాహకులను అభినందించారు. నవంబర్‌లో జరగనున్న ఎన్ఎంఎంఎస్ పరీక్షలో గుడివాడ నియోజకవర్గం నుంచి అత్యధిక సంఖ్యలో విద్యార్థులు అర్హత సాధించేలా ప్రతి పాఠశాలలో ప్రత్యేక శిక్షణ అందించేందుకు తాము సమన్వయంతో కృషి చేస్తామని మండల విద్యాశాఖ అధికారులు రజని, బాలాజీ, గోపాలరావు, శ్రీనివాస్, డేవిడ్ రాజులు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ఈ విద్యా చైతన్య కార్యక్రమంలో ఎఫిసెన్స్ ప్రాజెక్ట్ బృందం సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో ఎనిమిదో తరగతి విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Slug: nmms-scholar-app-launched-in-gudivada-by-mla-ramu
