రచన: జన గళం అమరావతి డెస్క్: రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర వివక్ష చూపుతున్నారని, బీసీలను ఆయన దరిదాపుల్లోకి కూడా రానివ్వరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల వారంతా అసమర్థులనే దురభిప్రాయం చంద్రబాబు మైండ్‌సెట్‌లో ఉందని ఆరోపించారు.
పేరుకేమో టీడీపీ బీసీల పార్టీ అని ప్రచారం చేసుకుంటారని, కానీ విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్సలర్లుగా గానీ, ఇతర ఉన్నత పదవుల్లో గానీ బీసీలను చంద్రబాబు ఎన్నడూ ప్రోత్సహించలేదని విమర్శించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బీసీలకు అందించిన ప్రోత్సాహాన్ని చంద్రబాబు ఎప్పుడైనా అందించారా అని నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల జీవోలు కోర్టులో వీగిపోతాయని ముందే తెలిసినా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే హడావిడి చేశారని, దానివల్ల బీసీలకు ఒరిగిందేమిటని ప్రశ్నించారు. గతంలో వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 కార్పొరేషన్ మేయర్ పదవుల్లో ఏకంగా 9 పదవులను (సుమారు 69 శాతం) బీసీలకే కేటాయించి సామాజిక న్యాయం చేశారని గుర్తుచేశారు. దమ్ముంటే రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం బీసీలకు 69 శాతం పదవులు కేటాయించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ధర్మాన సవాల్ విసిరారు.
