జన గళం అమరావతి/విశాఖపట్నం బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగనున్న నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ సంస్థాగత యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అరకు పార్లమెంట్ నియోజకవర్గాలకు స్థానిక సంస్థల ఎన్నికల కో-ఆర్డినేషన్ అడ్‌హాక్ కమిటీలను ఖరారు చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలం, ఆశావాహుల వివరాల సేకరణ, కూటమి సమన్వయమే లక్ష్యంగా ఈ కమిటీలు పనిచేయనున్నాయి.
శ్రీకాకుళం, విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గాలకు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి సమన్వయకర్తగా వ్యవహరిస్తుండగా.. పెడాడ రామ్మోహన్, గేదెల చైతన్య, జె. విష్ణు ప్రియాంక సభ్యులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విశాఖపట్నం పార్లమెంట్‌కు విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. అరకు పార్లమెంట్ పరిధిలోని గిరిజన ప్రాంతాల్లో పార్టీ సంస్థాగత బలోపేతానికి ప్రత్యేక బృందాన్ని నియమించారు. ప్రతి పార్లమెంట్ కమిటీలో ముగ్గురు కీలక నేతలు, వారికి సహాయంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాయకులు మరియు ‘నిర్వాహక్ దళ్’ సమన్వయం చేసుకోనున్నాయి. త్వరలోనే ఈ కమిటీలతో పవన్ కళ్యాణ్ స్వయంగా సమావేశమై స్థానిక పోరుపై దిశానిర్దేశం చేయనున్నారు.
