రచన: జన గళం ఎంటర్‌టైన్‌మెంట్/నేషనల్ డెస్క్: ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నా ఏమాత్రం వెరవక, అసాధారణ సమయస్ఫూర్తితో తోటి ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన ఫ్లైదుబాయ్ (Flydubai) భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ (Smit Machchhar) ధైర్యసాహసాలను మెగాస్టార్ చిరంజీవి కొణిదెల వేనోళ్ల ప్రశంసించారు. ఇజ్రాయెల్‌కు వెళ్తున్న విమానంలో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికీ, చాకచక్యంగా వ్యవహరించి ఎందరి ప్రాణాలనో కాపాడిన ఆయన అసమాన సాహసం ప్రతి భారతీయుడికీ గర్వకారణమని చిరంజీవి సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు.
ఆ క్లిష్ట సమయంలో కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ పవిత్ర హనుమాన్ చాలీసా పఠిస్తూ మనోధైర్యాన్ని కూడగట్టుకుని ఒక్కడై పోరాడారని తెలిసి తన మనసు చలించిపోయిందని, తీవ్ర భావోద్వేగానికి గురయ్యానని చిరంజీవి తెలిపారు. ఆ ఆంజనేయస్వామి దివ్య ఆశీస్సులు ఆయనపై ఎల్లప్పుడూ ఉండాలని, తీవ్ర గాయాల నుంచి ఆయన త్వరగా పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు. తోటి మానవుల ప్రాణాల రక్షణ కోసం కెప్టెన్ చూపిన మానవత్వానికి, మొక్కవోని ధైర్యానికి మనస్ఫూర్తిగా సెల్యూట్ చేస్తూ ‘జై హనుమాన్’ అంటూ చిరంజీవి భావోద్వేగ సందేశాన్ని ముగించారు.
