రచన: జన గళం విజయవాడ/గుడివాడ డెస్క్: కృష్ణా జిల్లాలోని గుడివాడ మరియు తాడిగడప మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణకు ఏళ్ల తరబడి ఎదురవుతున్న ప్రధాన న్యాయపరమైన చిక్కుముడులు ఎట్టకేలకు వీడిపోయాయి. సమీప గ్రామ పంచాయతీల విలీనం, వార్డుల పునర్విభజనను సవాలు చేస్తూ గతంలో దాఖలైన పలు వ్యాజ్యాలను హైకోర్టు కొట్టివేయడంతో ఎన్నికల నగారా మోగేందుకు మార్గం సుగమమైంది. కొత్తగా ఏర్పడే వార్డులు, డివిజన్ల పునర్విభజన ప్రక్రియలో న్యాయస్థానం జోక్యం చేసుకోలేదని స్పష్టం చేస్తూ హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించడంతో సుదీర్ఘ సందిగ్ధతకు తెరపడింది.
2021లో గుడివాడ మున్సిపాలిటీలో లింగవరం, వలివర్తిపాడు, మల్లయ్యపాలెం, బొమ్ములూరు, బిళ్లపాడు, భూషణగుళ్ల గ్రామాలను.. తాడిగడప మున్సిపాలిటీలో తాడిగడప, కానూరు, పోరంకి, యనమలకుదురు పంచాయతీలను విలీనం చేస్తూ ప్రతిపాదనలు జరిగాయి. అయితే, దీనిపై కొందరు కోర్టును ఆశ్రయించడంతో గత వైసీపీ హయాంలో ఇక్కడ ఎన్నికలు నిలిచిపోయాయి. తాజాగా సమీప విలీన సవరణ చట్టాన్ని సమర్థిస్తూ హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో అధికార యంత్రాంగం ఉపశమనం పొందింది. ఈ రెండు ప్రధాన పట్టణాల్లో రెండో విడతలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తుండగా.. అధికారులు ఓటర్ల జాబితా తయారీ, వార్డుల పునర్విభజన, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు వంటి చర్యలను వేగవంతం చేయనున్నారు.
