జన గళం గుంటూరు/మంగళగిరి బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కల్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు, పారదర్శక రాజకీయ పాలనకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి జనసేనలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గుంటూరు నగరంలోని పాత గుంటూరు ప్రాంతానికి చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం సాయంత్రం మంగళగిరి–తెనాలి ఫ్లైఓవర్ సమీపంలోని జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఏపీ మెడికల్ సర్వీసెస్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APMSIDC) చైర్మన్, స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులు శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నయబ్ కమల్‌ల సమక్షంలో ఈ భారీ చేరికలు జరిగాయి.
గుంటూరు తూర్పు నియోజకవర్గం 6వ వార్డుకు చెందిన ప్రముఖ నాయకులు కూరాకుల గురవయ్య, ఆయన కుమారులు కూరాకుల పెద్ద శ్రీనివాసరావు, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ డైరెక్టర్ కూరాకుల కోటేశ్వరరావు, చిన్న శ్రీనివాసరావు, చంద్రశేఖర్‌లతో పాటు పాత గుంటూరు ప్రాంతానికి చెందిన పలువురు వైసీపీ వార్డు అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, మహిళలు, యువత జనసేనలో చేరారు. వీరందరికీ చిల్లపల్లి శ్రీనివాసరావు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేనలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం ఉంటుందని, కూటమి ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పటిష్ట సమన్వయంతో పనిచేసి జనసేన జెండాను రెపరెపలాడించాలని, క్షేత్రస్థాయిలో పార్టీ విజయానికి ప్రణాళికాబద్ధంగా శ్రమించాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
