జన గళం న్యూఢిల్లీ/హైదరాబాద్ బ్యూరో: తెలంగాణ రాజధాని హైదరాబాద్ హైటెక్స్‌లో అక్టోబర్ 14, 15 తేదీలలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న ‘సమైఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ మీట్’ కార్యక్రమానికి కేంద్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్‌కు అధికారిక ఆహ్వానం అందింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్ ఆధ్వర్యంలో సమైఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి బృందం కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేసింది.
ఈ సందర్భంగా ప్రముఖ ఆడిటర్ శ్రీ ఏ.వి. రత్నం, పి.వి. రావు, సూర్యప్రకాష్, పి. రమేష్, సందీప్ తదితర సమైఖ్య ప్రతినిధులు సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశాలను కేంద్ర మంత్రికి వివరించారు. దేశ, విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వాణిజ్య రంగ నిపుణులు ఒకే వేదికపైకి వచ్చి నూతన వ్యాపార అవకాశాలు, హెల్త్‌కేర్, స్టార్టప్‌లు, పారిశ్రామిక వృద్ధికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను చర్చించేందుకు ఈ గ్లోబల్ సమ్మిట్ వేదిక కానుందని తెలిపారు. హైదరాబాద్ హైటెక్స్‌లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ సదస్సు ప్రారంభోత్సవానికి విచ్చేసి పారిశ్రామికవేత్తలకు దిశానిర్దేశం చేయాల్సిందిగా మంత్రి అనుప్రియ పటేల్‌ను కోరారు. ఆహ్వానాన్ని సానుకూలంగా స్వీకరించిన కేంద్ర మంత్రి, సమ్మిట్ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
