అవనిగడ్డ, 2026 సెప్టెంబర్ 20, (జనగళం బ్యూరో):
వినాయక చవితి నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా అవనిగడ్డ నియోజకవర్గ వ్యాప్తంగా ఆదివారం వినాయక నిమజ్జన శోభాయాత్రలు భక్తిప్రపత్తులతో, కోలాహలంగా సాగాయి. ఈ వేడుకల్లో అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావు విస్తృతంగా పర్యటించి, పలు మండపాల్లో ఏర్పాటు చేసిన నిమజ్జన రథాలను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
వివరాలు ఇలా ఉన్నాయి, అవనిగడ్డ ఒకటో వార్డు పరిధిలోని సింహాద్రి కాలనీలో నిమజ్జనానికి సిద్ధమైన వినాయకుడి విగ్రహ ఊరేగింపును విక్కుర్తి శ్రీనివాసరావు కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం స్థానిక ఆర్టీసీ కాలనీలోని వినాయకుని మందిరానికి చేరుకుని స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అలాగే రెండో వార్డులోని ప్రసిద్ధ అంకాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద, బీసీ కాలనీల్లో ఏర్పాటు చేసిన గణపతి నిమజ్జన ఊరేగింపులను సైతం ఆయన ప్రారంభించి, భక్తులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్నారు.
అన్నసమారాధనల్లో అన్నదానం – నిర్వాహకుల సత్కారం:
నిమజ్జనోత్సవాల సందర్భంగా అవనిగడ్డ గుర్రపు చెరువు వద్ద చేపట్టిన భారీ అన్నసమారాధన కార్యక్రమంలో విక్కుర్తి శ్రీనివాసరావు పాల్గొని భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. అనంతరం ఘంటశాల మండలం శ్రీకాకుళం గ్రామంలోని విఘ్నేశ్వర ఆలయం వద్ద నిర్వహించిన అన్నదాన మహోత్సవంలోనూ పాల్గొని భక్తులకు సేవలందించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు విక్కుర్తి శ్రీనివాసరావును శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలి:
ఈ సందర్భంగా విక్కుర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వినాయక చవితి నవరాత్రులను నియోజకవర్గ ప్రజలంతా ఎంతో భక్తిశ్రద్ధలతో, ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవడం ఆనందదాయకమన్నారు. విఘ్నేశ్వరుని కృపాకటాక్షాలతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి ముఖ్య నేతలు, వార్డు పెద్దలు, ఉత్సవ కమిటీ సభ్యులు మరియు అశేష భక్తజనం పాల్గొన్నారు.
