ముంబై, 2026 సెప్టెంబర్ 20, (జనగళం డెస్క్):
ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఐఐటీ బాంబే ప్రాంగణంలో మరో విద్యార్థి విషాదాంతం చోటుచేసుకుంది. ఎనర్జీ సైన్స్ ఇంజనీరింగ్ విభాగంలో బి.టెక్ రెండో సంవత్సరం చదువుతున్న సాహిల్ వాకోడే (20) తన హాస్టల్ నంబర్ 4 గదిలో శవమై తేలడం తీవ్ర విషాదాన్ని నింపింది. విద్యార్థి మృతికి ప్రొఫెసర్ల మానసిక వేధింపులు, కులవివక్షే కారణమని ఆరోపిస్తూ మృతుడి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పొవై పోలీసులు ఐఐటీ ప్రొఫెసర్ సూర్యనారాయణ దుల్లాపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) కింద ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసుతో పాటు ఎస్సీ/ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం (అట్రాసిటీ యాక్ట్) కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.
వివరాలు ఇలా ఉన్నాయి, శుక్రవారం మధ్యాహ్నం జరిగిన మిడ్-సెమిస్టర్ పరీక్షల సమయంలో సాహిల్ మొబైల్ ఫోన్ వినియోగించాడన్న కారణంతో ఇన్విజిలేటర్‌గా ఉన్న ప్రొఫెసర్ సూర్యనారాయణ దుల్లా అతడిని హాల్ నుంచి బయటకు పంపించినట్లు సమాచారం. సెమిస్టర్ నుంచి డీబార్ చేస్తామని, భవిష్యత్తు నాశనం చేస్తామని ప్రొఫెసర్ బెదిరించడంతో విద్యార్థి తీవ్ర మనస్తాపానికి గురై హాస్టల్ గదికి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తోటి విద్యార్థులు ఆరోపించారు. మరోవైపు తాము ఎటువంటి క్రమశిక్షణా చర్యలు ప్రారంభించలేదని, కేవలం కౌన్సెలింగ్ మాత్రమే ఇచ్చామని ఐఐటీ యాజమాన్యం ప్రకటించింది.
తల్లిదండ్రుల నిరసన – రంగంలోకి క్రైమ్ బ్రాంచ్:
తమ కుమారుడిని గత మూడు నెలలుగా కులం పేరుతో కించపరుస్తూ వేధిస్తున్నారని, డైరెక్టర్ ఆదేశాలతోనే ప్రొఫెసర్ దుల్లా తీవ్ర మానసిక క్షోభకు గురిచేశారని సాహిల్ తండ్రి రవీంద్ర వాకోడే ఆరోపించారు. బాధ్యులైన వారిని అరెస్ట్ చేసేంత వరకు పోస్ట్‌మార్టం గది నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లబోమని రాజావాడి ఆసుపత్రి వద్ద కుటుంబీకులు 7 గంటలకు పైగా బైఠాయించారు. ఉన్నతాధికారులు రంగంలోకి దిగి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న ముంబై పోలీస్ కమిషనర్.. దర్యాప్తును తక్షణమే ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ స్థాయి అధికారి నేతృత్వంలో విచారణ ముమ్మరంగా సాగుతోంది.
