మచిలీపట్నం, 2026 సెప్టెంబర్ 19, (జనగళం బ్యూరో):
మచిలీపట్నం నగరంలోని ఆర్టీసీ కాలనీ శ్రీ విజయ గణపతి దేవాలయ ప్రాంగణంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలకు కృష్ణా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) వి. విద్యాసాగర్ నాయుడికి శనివారం ఘనంగా ఆహ్వానం అందింది.
వివరాలు ఇలా ఉన్నాయి, దేవాలయ కమిటీ ముఖ్య ప్రతినిధి కొట్టె వెంకటరావు ఆధ్వర్యంలో ఆలయ నిర్వాహకులు, కమిటీ సభ్యులు ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉత్సవాల విశేషాలను వివరించి, నవరాత్రుల ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు. దేదీప్యమానంగా జరుగుతున్న ఈ శరన్నవరాత్రులలో ఒకరోజు సకుటుంబ సపరివార సమేతంగా దేవాలయానికి విచ్చేసి, శ్రీ సిద్ధి బుద్ధి సమేత విజయ గణనాథుని దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొనాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. ఆహ్వానాన్ని స్వీకరించిన ఎస్పీ ఉత్సవ కమిటీకి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
