విజయవాడ, 2026 సెప్టెంబర్ 20, (జనగళం బ్యూరో):
వినాయక చవితి వంటి పవిత్ర పర్వదినాలు సమాజంలో సోదరభావాన్ని, స్థానికుల మధ్య ఐక్యతను మరింతగా పెంపొందించేందుకు ఎంతగానో దోహదపడతాయని దివంగత నేత వంగవీటి మోహన రంగా తనయురాలు వంగవీటి ఆశా కిరణ్ పేర్కొన్నారు. వినాయక చవితి నవరాత్రోత్సవాల సందర్భంగా పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లోని గణేష్ మండపాలను ఆమె సందర్శించారు.
వివరాలు ఇలా ఉన్నాయి, కామకోటి నగర్‌లో ‘రిషి ఫ్రెండ్స్ సర్కిల్’ ఆధ్వర్యంలో వైభవంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని వంగవీటి ఆశా కిరణ్ ముఖ్య అతిథిగా సందర్శించారు. ఈ సందర్భంగా మండపంలో కొలువుదీరిన వినాయకుడికి ఆమె శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆమెకు వేదాశీర్వచనం అందజేసి తీర్థప్రసాదాలు అందజేశారు.
సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణే లక్ష్యం:
ఈ సందర్భంగా వంగవీటి ఆశా కిరణ్ మాట్లాడుతూ.. వినాయక చవితి ఉత్సవాలు మన భారతీయ సంస్కృతి, సనాతన సంప్రదాయాలను పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అన్ని వర్గాల ప్రజలు, యువత ఒక్కచోట చేరి ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు చేయడం, అన్నదానాలు, నిమజ్జన ఊరేగింపులు నిర్వహించడం ద్వారా వారి మధ్య ఆత్మీయతలు, ఐక్యత మరింత బలపడతాయని తెలిపారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది, ప్రజలంతా సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు ఆమె తెలిపారు. అనంతరం మండప కమిటీ నిర్వాహకులు ఆశా కిరణ్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు రిషి, జషు, అలోక్, విజయ్, తేజ తదితర యువకులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Slug: print-vijayawada-west-ganesh-utsav-pandals-visit-vangaveeti-asha-kiran-unity-culture
