జన గళం తెనాలి/గుంటూరు బ్యూరో: తెనాలి పట్టణ పరిధిలోని చంద్రబాబు నాయుడు కాలనీ (సిబిన్ కాలనీ రాజీవ్ గృహ కల్ప అపార్ట్మెంట్స్ ప్రాంతం) సమగ్ర అభివృద్ధి దిశగా అడుగులు పడ్డాయి. ప్రజల చెంతకే మెరుగైన వైద్యాన్ని చేరువ చేయడంతో పాటు మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా సుమారు రూ. 1.77 కోట్ల పైచిలుకు విలువైన పనులకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. స్థానికుల ఆరోగ్య రక్షణ కోసం రూ. 1.40 కోట్ల వ్యయంతో అత్యాధునిక అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC) భవన నిర్మాణాన్ని ప్రారంభించారు.
దీంతోపాటు కాలనీవాసుల రాకపోకలు, పారిశుద్ధ్య మెరుగుదల కోసం రూ. 15.50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం, రూ. 21.50 లక్షలతో సైడ్ కాల్వలు మరియు డ్రైనేజీ పనులను ప్రారంభించారు. అంతేకాకుండా మరో రూ. 1.50 కోట్ల వ్యయంతో ప్రధాన రహదారి అభివృద్ధికి పరిపాలనా అనుమతులు లభించాయి. రాబోయే మూడు నెలల వ్యవధిలో కాలనీలో అన్ని మౌలిక వసతుల పనులను శరవేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే స్థానికుల దీర్ఘకాలిక డిమాండ్ అయిన వైకుంఠపురం వైపు నూతన వంతెన నిర్మాణానికి కూడా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం, సురక్షిత రహదారులు కల్పించి రాజీవ్ గృహ కల్ప ప్రాంతాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
