తిరువూరు రాజకీయాల్లో మార్పు: వైసిపిపై ఎమ్మెల్యే కొలికపూడి వ్యంగ్యాస్త్రాలు జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తన వాట్సాప్ స్టేటస్ ద్వారా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. గతంలో సొంత పార్టీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై విమర్శలు చేసిన ఆయన, ఇప్పుడు అకస్మాత్తుగా వ్యూహం మార్చి ప్రత్యర్థి పార్టీపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుండటం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ముఖ్యంగా వైసిపి ఇంచార్జి నల్లగట్ల స్వామిదాస్ పేరు ప్రస్తావించకుండానే ఆ పార్టీ శ్రేణులపై పరోక్ష విమర్శలు గుప్పించడం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.సొంత పార్టీకి చెందిన ఎంపీ కేశినేని చిన్నికి ఇటీవలే జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కొలికపూడి, ఇప్పుడు వైసిపిని టార్గెట్ చేయడం వెనుక బలమైన వ్యూహం దాగి ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో ఎటువంటి వర్గపోరు లేదని, అందరం ఒక్కటేనని అధిష్టానానికి స్పష్టమైన సందేశం పంపేందుకే ఆయన ఈ విధంగా వ్యవహరిస్తున్నారని పార్టీ ముఖ్య నేతలు విశ్లేషిస్తున్నారు. నిన్నటి వరకు ఆయనను వైసిపి కోవర్టుగా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో విమర్శలు చేసిన సొంత పార్టీలోని ఒక వర్గానికి గట్టి సమాధానం ఇచ్చేందుకే ఈ కొత్త ఎత్తుగడ వేసినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.మున్సిపల్ ఎన్నికల ముందు జరుగుతున్న ఈ పరిణామాలు ఎంపీ చిన్ని వర్గీయులతో పాటు వైసిపి నేతల నుంచి ఎలాంటి స్పందన రాబడుతుందనే ఆసక్తి స్థానికుల్లో నెలకొంది. మనసులో ఒకరిని ఉంచుకుని పైకి మరొకరిని విమర్శిస్తున్నారంటూ వైసిపి నాయకులు ఈ పరిణామాలపై తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా మున్సిపల్ పోరు సమీపిస్తున్న తరుణంలో ఎమ్మెల్యే స్టేటస్‌లు తిరువూరులో సరికొత్త రాజకీయ చర్చకు తెరలేపాయి.
Slug: tiruvuru-mla-kolikapudi-srinivas-rao-satirical-status-on-ycp
Oplus_16908288
