రచన: జన గళం స్పెషల్ డెస్క్: అమెరికాలోని సియాటెల్ నగరంలో ప్రముఖ వ్యాపారవేత్తగా, క్వాడ్రెంట్ (Quadrant) సాఫ్ట్వేర్ సంస్థ అధినేతగా రాణిస్తూ వందలాది మంది తెలుగు యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న శ్రీ గంగిపాముల భాస్కర్‌ను అఖిల భారత చిరంజీవి యువత తరఫున నాయకుడు రవణం స్వామి నాయుడు ఘనంగా సత్కరించారు. అమెరికా గడ్డపై వ్యాపార రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పటికీ, సొంత గడ్డపై మమకారాన్ని మరువకుండా సమాజ సేవలో ముందుంటున్న ఆయన వ్యక్తిత్వాన్ని ఈ సందర్భంగా కొనియాడారు.
వ్యాపారాన్ని కేవలం లాభార్జనకే పరిమితం చేయకుండా సామాజిక బాధ్యతగా భావిస్తూ, క్వాడ్రెంట్ సంస్థను భారతదేశంలోని ప్రధాన నగరాలకు విస్తరించి స్థానిక యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించడం భాస్కర్ సేవా దృక్పథానికి నిదర్శనమని రవణం స్వామి నాయుడు పేర్కొన్నారు. అంతేకాకుండా జనసేన పార్టీకి నిరంతరం అండగా నిలుస్తూ, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వాన్ని బలపరుస్తున్న ఆయన సేవలు అత్యంత అభినందనీయమన్నారు. మెగా కుటుంబం పట్ల అంతులేని అభిమానంతో, సమాజ హితం కోసం నిరంతరం పరితపించే గంగిపాముల భాస్కర్ మరెందరికో స్ఫూర్తిప్రదాతగా నిలుస్తున్నారని, ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
