జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల విద్యాలయాల పార్ట్-టైమ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు లెక్చరర్లు గత కొన్ని నెలలుగా వేతనాలు అందక పడుతున్న తీవ్ర ఆర్థిక ఇబ్బందులపై విజయవాడ ధర్నా చౌక్‌లో నిర్వహిస్తున్న మహా ధర్నా ఐదో రోజుకు చేరుకుంది. ఈ నిరసన దీక్షకు ఏపీ ఎంఆర్‌పీఎస్ (AP MRPS) రాష్ట్ర అధ్యక్షులు శ్రీ దాసరి సువర్ణ రాజు గారు స్వయంగా విచ్చేసి గురుకుల పార్ట్-టైమ్ ఉద్యోగులకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ బాధితులకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా దాసరి సువర్ణ రాజు గారు మాట్లాడుతూ.. గురుకులాల ద్వారా విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే పార్ట్-టైమ్ టీచర్లు, లెక్చరర్లకు గత కొన్ని నెలలుగా వేతనాలు రాకపోవడంతో వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ధర్నా చౌక్‌లో ఇంతటి తీవ్రమైన సమస్యపై ఐదు రోజులుగా ఆందోళన జరుగుతున్నప్పటికీ, ప్రభుత్వం నుండి కనీస స్పందన లేకపోవడం, ఏ ఒక్క అధికారికీ వారి సమస్యలపై సంప్రదింపులు జరపాలని అనిపించకపోవడం అత్యంత బాధాకరమని విమర్శించారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడానికి కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించే ప్రభుత్వానికి, చదువు చెప్పే గురుకులాల ఉపాధ్యాయులకు వేతనాలు ఇవ్వడానికి మాత్రం నిధులు లేకపోవడం విచారకరమని మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు తన ‘యువగలం’ పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీని గుర్తుచేస్తూ, తక్షణమే ఈ సమస్యను పరిష్కరించి పెండింగ్ వేతన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా విధులను నిర్వహిస్తూ అదే స్థాయిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ, పార్ట్-టైమ్ సిబ్బందికి నామమాత్రపు వేతనాలు ఇస్తుండటం రాజ్యాంగ విరుద్ధమని సువర్ణ రాజు పేర్కొన్నారు. దీనివల్ల ‘సమాన పనికి సమాన వేతనం’ సూత్రాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోందని ఆరోపించారు. కేవలం పార్ట్-టైమ్ విధానంతో వారిని శోషణకు గురిచేయకుండా, ఈ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా నియమించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించేలా ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Slug: vijayawada-ambedkar-gurukul-part-time-employees-dharna-dasari-suvarna-raju
