జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: గత వైసిపి ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్ల పథకంలో జరిగిన అవినీతిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సిన పథకాన్ని కూడా అవినీతికి అడ్డాగా మార్చి, కేంద్రం కేటాయించిన నిధులను దారి మళ్లించారని, ఇంటి స్థలాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి దోషులను తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన ఇళ్లు అందించే లక్ష్యంతో ఆధునిక సాంకేతికతను జోడిస్తూ సరికొత్త ముసాయిదాకు తెరలేపారు.
దేశంలోనే తొలిసారిగా అత్యంత ఆధునిక త్రిడి ప్రింటింగ్ సాంకేతికతతో ఇళ్ల నిర్మాణానికి తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెం గ్రామం వేదిక కావడం ఎంతో ఆనందదాయకమని నేతలు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మరియు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమక్షంలో జరిగిన ఈ త్రిడి ప్రింటింగ్ ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని బుర్రిపాలెంలో ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిలో పెట్టి, పేదలకు మరింత వేగంగా ఇళ్లు అందించేందుకు కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో అమలువుతున్న పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని వెల్లడించారు. ప్రతి గ్రామానికి సిసి రోడ్లు, బిటి రోడ్లు మరియు ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన మంచినీరు అందించాలనే సంకల్పంతో పల్లెల రూపురేఖలు పూర్తిగా మారుతున్నాయని తెలిపారు. పేదలకు ఇళ్లు, పల్లెలకు అభివృద్ధి మరియు రాష్ట్రానికి సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజల ఆశీర్వాదంతో ఆంధ్రప్రదేశ్‌ను మరింత వేగంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు.
Slug: ycp-housing-corruption-probe-3d-printing-burripalem
