జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మంగళవారం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావు వివిధ మండలాల్లోని వినాయక మండపాలు, పుణ్యక్షేత్రాలను సందర్శించి ప్రత్యేక పూజలు మరియు అన్నసమారాధన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భక్తులందరూ ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆయన గణనాథుని ప్రార్థించారు.
పర్యటనలో భాగంగా మోపిదేవి మండలం బొబ్బర్లంక గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో విక్కుర్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చల్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలో జరిగిన మహా అన్నసంతర్పణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. అదేవిధంగా ఘంటసాల మండలం తాడేపల్లి గ్రామంలో మరియు ఘంటసాల గ్రామంలోని చారిత్రక జగదీశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అన్నదాన వేడుకల్లో స్వయంగా పాల్గొని భక్తులకు వడ్డించారు. ఈ సందర్భంగా జగదీశ్వర స్వామి వారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించగా, ఆలయ కమిటీ ప్రతినిధులు విక్కుర్తి శ్రీనివాసరావును శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు, పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
