జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: కృష్ణా జిల్లా ఘంటసాల మండలం గోగినేనిపాలెం గ్రామ ప్రధాన రహదారి నిర్మాణ పనులు అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ ప్రత్యేక చొరవతో అత్యంత వేగంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మంజూరు చేసిన రూ. 2.10 కోట్ల సాస్కి (SASCI) నిధులతో ఈ నూతన రహదారి అభివృద్ధి పనులను చేపట్టారు.
కొడాలి – శ్రీకాకుళం ప్రధాన రహదారి నుంచి గోగినేనిపాలెం గ్రామానికి వెళ్లే సుమారు 3.80 కిలోమీటర్ల మేర అధునాతన తారు రోడ్డును నిర్మిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ డీఈఈ పగడాల సురేష్ బాబు, ఏఈ సీహెచ్. బ్రహ్మానందబాబుల ప్రత్యక్ష పర్యవేక్షణలో మంగళవారం రోడ్డు నిర్మాణంలో భాగంగా పటిష్టమైన మెటల్ లేయర్ పనులను పూర్తి చేశారు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా త్వరితగతిన తారు లేయర్ వేసి రోడ్డు నిర్మాణాన్ని సంపూర్ణంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు స్పష్టం చేశారు.
