జన గళం క్రైమ్ డెస్క్: కస్టమర్‌లా నటిస్తూ సెల్‌ఫోన్ దుకాణాల్లో చోరీలకు పాల్పడుతున్న ఘరానా యువకుడిని ఉయ్యూరు టౌన్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి సుమారు లక్ష రూపాయల విలువైన ఐదు ఖరీదైన సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఉయ్యూరు పట్టణంలోని ఒక మొబైల్ షోరూమ్‌కు పలుమార్లు వెళ్లిన నిందితుడు, వివిధ రకాల మోడళ్లను కొనుగోలు చేస్తున్నట్లు నటిస్తూ యజమానుల దృష్టి మరల్చి మొబైళ్లను తస్కరించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు.. చిన ఓగిరాల గ్రామానికి చెందిన దండుగుల నాగ దుర్గారావు (23) ఈ నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. మంగళవారం ఉదయం ఎస్సై ప్రతాపరెడ్డి తన సిబ్బందితో కలిసి నిందితుడిని అదుపులోకి తీసుకుని ఐదు మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. ఇతనిపై గతంలో తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక దేవాలయంలో చోరీ చేసిన కేసు కూడా నమోదై ఉందని సీఐ టి.వి.వి. రామారావు వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో గన్నవరం సబ్ జైలుకు తరలించారు.
