జన గళం సినీ డెస్క్: పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రాన్ని నిర్మించి, తొలి ప్రయత్నంలోనే ఉత్తమ తెలుగు చిత్రంగా ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును కైవసం చేసుకున్న శ్రీమతి కొణిదెల నిహారికకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అఖిల భారత చిరంజీవి యువత తరఫున రవణం స్వామినాయుడు ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. సినిమా ఆమె రక్తంలోనే ఉందని, నటన ఆమె ఆశయం, లక్ష్యాల్లో భాగమని, సినిమా నిర్మాణం ఆమెకు కుటుంబ వారసత్వంగా అబ్బిందని కొనియాడారు.
శ్రీ కొణిదెల నాగబాబు గారాలపట్టిగా, మెగా ఫ్యామిలీ వారసురాలిగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించి నటిగా గుర్తింపు తెచ్చుకున్న నిహారిక, ఇప్పుడు నిర్మాతగా మారి ‘కమిటీ కుర్రోళ్లు’ వంటి చక్కటి భావోద్వేగ భరిత చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారని పేర్కొన్నారు. తొలి చిత్రంతోనే జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా అవార్డు దక్కించుకుని మెగా కుటుంబ పేరు ప్రఖ్యాతులను మరింత ఉన్నత స్థానానికి చేర్చారని, ఎందరో యువ నిర్మాతలకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. ఆమె భవిష్యత్ సినీ ప్రయాణం మరింత విజయవంతంగా కొనసాగి, మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకోవాలని అశేష మెగా అభిమానుల పక్షాన మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
