బిజినెస్ డెస్క్: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ అయిన ఎన్బీఎఫ్సీ లైసెన్స్‌ను వదులుకోవాలని భావించిన ప్రముఖ సంస్థ టాటా సన్స్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ సమర్పించిన లైసెన్స్ రద్దు దరఖాస్తును ఆర్బీఐ తోసిపుచ్చింది. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ కంపెనీ కార్యదర్శి అలాగే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌కు ప్రత్యేకంగా ఓ లేఖను పంపింది. ఈ పరిణామంతో నిబంధనల ప్రకారం రాబోయే కాలంలో తప్పనిసరిగా దేశీయ స్టాక్ మార్కెట్లలో టాటా సన్స్ లిస్ట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
గతంలో 2022 సెప్టెంబర్ కాలంలో టాటా సన్స్‌ను ఉన్నత శ్రేణి ఎన్‌బీఎఫ్‌సీగా ఆర్బీఐ వర్గీకరించింది. దీని ప్రకారం మూడేండ్ల గడువులోగా అంటే 2025 సెప్టెంబర్‌కల్లా స్టాక్ మార్కెట్లలో నమోదు కావాల్సి ఉండగా దీనిపై టాటా సన్స్ ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలోనే 2024 సంవత్సరంలో భారీ ఎత్తున రుణాలు చెల్లించి మార్చి నెలలో తమ కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ ఎన్బీఎఫ్సీ లైసెన్స్‌ను వెనక్కి ఇస్తామని ఆర్బీఐకి విజ్ఞప్తి చేసింది. అయితే ఈ అభ్యర్థనను పెండింగ్‌లో పెట్టిన కేంద్ర బ్యాంక్ తాజాగా ఆ విజ్ఞప్తిని పూర్తిగా తిరస్కరించింది. కాగా రెండు లక్షల కోట్లకు పైగా ఆస్తులున్న టాటా సన్స్‌ను ప్రధాన ఎన్‌బీఎఫ్‌సీల జాబితాలోనే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 17 ప్రథమ శ్రేణి ఎన్బీఎఫ్సీలలో స్టాక్ మార్కెట్లలో నమోదు కాని ఏకైక సంస్థగా టాటా సన్స్ నిలిచింది. పబ్లిక్ లిస్టింగ్‌లోకి వస్తే కంపెనీకి సంబంధించిన ఆర్థిక స్థితిగతులు, పెట్టుబడులు, వాటాల విలువ తదితర వివరాలన్నీ బహిర్గతం చేయాల్సి ఉంటుందని, అంతేకాకుండా ప్రతి కీలక నిర్ణయానికి షేర్ హోల్డర్ల అనుమతి తప్పనిసరి అవుతుందనే కారణాలతోనే ఈ లైసెన్స్ రద్దుకు ఆ సంస్థ ప్రయత్నించినట్లు సమాచారం. టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయల్ టాటా కూడా పబ్లిక్ లిస్టింగ్ వల్ల సంస్థ దీర్ఘకాలిక నిర్మాణంపై ప్రభావం పడుతుందని ఆర్బీఐకి తెలిపారు. అయినప్పటికీ ఆర్బీఐ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో త్వరలోనే టాటా సన్స్ మార్కెట్ ఎంట్రీ ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
