ప్రధాని నరేంద్ర మోదీని ఆయన మాజీ పాఠశాల సహచరుడు ఒకరు న్యూఢిల్లీలో కలుసుకున్నారు. గుజరాత్‌లోని వడ్నగర్‌లో ఉన్న బీఎన్ స్కూల్‌లో ప్రధాని మోదీతో కలిసి చదువుకున్న 81 ఏళ్ల అస్గరలీ వోహ్రా సెప్టెంబర్ 8న తన భార్యతో కలిసి మోదీని భేటీ అయ్యారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని మీరా-భయందర్‌కు చెందిన అస్గరలీ వోహ్రా తన భూమిని బిల్డర్ సంస్థలు ఆక్రమించుకున్నాయని ఆరోపించారు. చాలా కాలంగా కొనసాగుతున్న ఈ భూ వివాదంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ ప్రధానికి ఒక లేఖను అందజేసినట్లు తెలిపారు.
భయందర్ ఈస్ట్‌లోని నవ్‌గఢ్ రోడ్డులో ఉన్న 2,810 చదరపు మీటర్ల స్థలాన్ని తాను 1989లో రిజిస్టర్డ్ ఒప్పందం ద్వారా కొనుగోలు చేశానని, దానిని ఎప్పుడూ విక్రయించలేదని లేదా బదిలీ చేయలేదని వోహ్రా వెల్లడించారు. బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతాకు అనుబంధంగా ఉన్న బిల్డర్లు, స్వయం బిల్డర్స్‌తో కుమ్మక్కై నకిలీ పత్రాలు సృష్టించి తన ఆస్తిని ఆక్రమించారని ఆయన ఆరోపించారు. తన ప్రమేయం లేకుండా ఆ భూమిని రెండు భాగాలుగా విభజించారని, ఒక భాగం స్వయం బిల్డర్స్ ఆధీనంలో ఉండగా మరో భాగం సెవెన్ ఎలెవెన్ కన్స్ట్రక్షన్స్ నియంత్రణలో ఉందని పేర్కొన్నారు. యాజమాన్య హక్కులు తనకే ఉన్నప్పటికీ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగం ఆ వివాదాస్పద స్థలంలో నిర్మాణానికి అనుమతులు ఇచ్చిందని ఆరోపించారు.
ఈ నకిలీ పత్రాల వ్యవహారంపై 2015లోనే తాను ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయగా కోర్టుకు చేరిందని, అయితే కేసు నమోదైన సుమారు 11 ఏళ్ల తర్వాత ఈ ఏడాదిలో సీఐడీ నివేదిక సమర్పించిందని వోహ్రా తెలిపారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే అధికారుల నుంచి జాప్యం జరిగిందని, తనకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే 2025లో తనపై ఎదురు కేసు నమోదు చేశారని ఆయన ఆరోపించారు. పత్రాల తారుమారులో ప్రమేయం ఉన్నవారిపై చర్యలు తీసుకోవడంలో స్థానిక పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని పేర్కొంటూ ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని ప్రధానిని కోరారు. ప్రధానితో ఈ సమావేశం అనంతరం స్పందించిన స్థానిక మున్సిపల్ అధికారులు ఈ భూ వివాదంపై సెప్టెంబర్ 16న విచారణకు షెడ్యూల్ జారీ చేసి, స్వయం బిల్డర్స్ అలాగే సెవెన్ ఎలెవెన్ కన్‌స్ట్రక్షన్స్ ప్రతినిధులు హాజరు కావాలని ఆదేశించారు.
