ఒడిశా రాష్ట్రంలోని బాలసోర్ జిల్లా అటవీ ప్రాంతంలో అక్రమ రవాణాలో భాగంగా పట్టుబడిన ఐదు పిల్ల ఒరంగుటాన్లకు అధికారులు ప్రత్యేక పర్యవేక్షణలో మ్యూజిక్ థెరపీ అందిస్తున్నారు. సహజంగా ఇండోనేషియాలోని బోర్నియో, సుమత్రా వర్షారణ్యాలలో మాత్రమే కనిపించే ఈ అరుదైన జీవులు తమ ఆవాసానికి సుమారు నాలుగు వేల కిలోమీటర్ల దూరంలో లభించడం గమనార్హం. సముద్ర లేదా భూ మార్గాల ద్వారా వీటిని అక్రమంగా తరలించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఆరు నెలల నుంచి ఏడాది వయసున్న ఈ పిల్లలు సాధారణంగా ఎనిమిదేళ్ల వరకు తల్లి సంరక్షణలోనే పెరుగుతాయి.
తల్లులకు దూరమవడం వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి, ఆందోళనకు గురైన ఈ అరుదైన జీవులను భువనేశ్వర్‌లోని నందన్‌కానన్ జూలాజికల్ పార్కుకు తరలించారు. జీవ శాస్త్రవేత్తల సూచనల మేరకు వీటిలో నెలకొన్న ఒత్తిడిని తగ్గించేందుకు అధికారులు తక్కువ వాల్యూమ్‌తో మృదువైన భారతీయ శాస్త్రీయ సంగీతం అలాగే వాయిద్య సంగీతాన్ని వినిపిస్తున్నారు. ఈ ప్రశాంతమైన వాతావరణం వల్ల ఇవి క్రమంగా కోలుకుంటున్నాయని అధికారులు వెల్లడించారు. సంగీతంతో పాటు ఆడుకోవడానికి వీలుగా మృదువైన బొమ్మలు, ఊయలలను కూడా ఏర్పాటు చేశారు.
నందన్‌కానన్ జూ డిప్యూటీ డైరెక్టర్ ప్రదీప్ మిరాసే తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం ఈ ఐదు ఒరంగుటాన్లలో మూడు చురుగ్గా ఆడుకుంటుండగా, మిగిలిన రెండు జీవులు మాత్రం ఇంకా కొంత ఆందోళనలోనే ఉన్నాయి. వీటితో పాటు వీటికి అవసరమైన వైద్య పరీక్షలు, డీవార్మింగ్ ప్రక్రియలను నిర్వహిస్తున్నారు. అలాగే నిత్యం పండ్లు, బేబీ ఫుడ్, పాలను అందిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
