ఇండోనేషియా తీర ప్రాంతంలో సంభవించిన ఘోర నౌక ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 130 మంది ఆచూకీ గల్లంతైంది. మొత్తం 213 మంది ప్రయాణికులు, 30 మంది సిబ్బందితో కలిపి మొత్తంగా 243 మందితో ప్రయాణిస్తున్న వెర్గో ట్రాన్స్పోర్ట్ 8 నౌక జావా సముద్రంలో మునిగిపోయింది. ఈ పెను విషాదంలో ఇప్పటివరకు సహాయక బృందాలు 107 మందిని సురక్షితంగా రక్షించగలిగాయి. అలాగే ఆరుగురి మృతదేహాలను బయటకు వెలికితీశారు.
తూర్పు జావాలోని సురబయ నుంచి శనివారం బయలుదేరిన ఈ నౌక దక్షిణ కాలిమంటన్లోని బంజర్మాసిన్కు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో నౌక కెప్టెన్ అధికారులకు చివరిసారిగా సమాచారం అందించారు. సముద్రంలో మూడు మీటర్ల ఎత్తున భారీ అలలు ఎగిసిపడుతున్నాయని, దీంతో నౌక ఒకవైపునకు ఒరిగిపోతోందని ఆయన తెలిపారు. ఆ తర్వాత కొద్దిసేపటికే నౌకతో సంబంధాలు పూర్తిగా తెగిపోయినట్లు అధికారులు వెల్లడించారు. బంజర్మాసిన్ రేవుకు సుమారు 148 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన జరిగినట్లు నిర్ధారణ అయింది.
సమాచారం అందిన వెంటనే స్పందించిన అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. నౌకాదళానికి చెందిన నౌకతో పాటు మరో నాలుగు నౌకలు, ఒక హెలికాప్టర్, సమీపంలోని టగ్బోట్ల సహాయంతో గల్లంతు అయిన వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. కాపాడిన క్షతగాత్రులను తూర్పు జావా పోర్టుకు తరలిస్తున్నారు. మరోవైపు బంజర్మాసిన్లోని త్రిశక్తి పోర్టు వద్ద బాధితుల బంధువులు పెద్ద సంఖ్యలో చేరుకుని తమ వారి జాడ కోసం ఆందోళనతో ఎదురుచూస్తున్నారు. వేలాది ద్వీపాలు కలిగిన ఇండోనేషియాలో రవాణా కోసం ఫెర్రీలపై ఎక్కువగా ఆధారపడుతుండగా, భద్రతా లోపాలు మరియు రిజిస్టర్డ్ ప్రయాణికుల సంఖ్యకు వాస్తవ సంఖ్యకు పొంతన లేకపోవడం వల్ల ఇలాంటి సముద్ర ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
