రచన: జన గళం గుడ్లవల్లేరు డెస్క్: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఎ.ఎ.ఎన్.ఎమ్ అండ్ వి.వి.ఆర్.ఎస్.ఆర్ పాలిటెక్నిక్ కళాశాల వేదికగా శనివారం (ది. 03-10-2026) నిర్వహించిన జిల్లా స్థాయి ‘సేవా సంకల్ప్’ వక్తృత్వ పోటీల్లో ప్రముఖ విద్యాసంస్థ కొమ్మారెడ్డి స్కూల్ విద్యార్థి పి. మహిధర్ అద్భుత ప్రతిభ కనబరిచాడు. జిల్లాలోని వివిధ మండలాల స్థాయిల్లో ప్రథమ స్థానాల్లో నిలిచి ఎంపికైన 86 మంది ప్రతిభావంతులైన విద్యార్థులు ఈ జిల్లా స్థాయి పోటీల్లో తలపడ్డారు. అత్యంత ప్రతిభావంతమైన పోటీ మధ్య 9, 10 తరగతుల విభాగంలో కొమ్మారెడ్డి పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి పి. మహిధర్ తన వాగ్ధాటితో ఆకట్టుకుని జిల్లా స్థాయిలో తృతీయ బహుమతిని కైవసం చేసుకున్నాడు.
ఈ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) యు.వి. సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరై విజేత మహిధర్‌కు జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, సమాజ సేవా భావాలను వెలికితీయడానికి ఇలాంటి వక్తృత్వ పోటీలు ఎంతో దోహదపడతాయన్నారు. జిల్లా స్థాయిలో తృతీయ స్థానం సాధించిన పి. మహిధర్ అక్టోబర్ 9న రాజధాని అమరావతిలో జరగనున్న ప్రతిష్టాత్మక రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించాడు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి మహమ్మద్ జాకీర్ హుస్సేన్, పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపల్ జీ.వి. సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు తాతినేని శ్రీరామ్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన మహిధర్‌ను కొమ్మారెడ్డి స్కూల్ డైరెక్టర్ కొమ్మారెడ్డి కిషోర్, కరెస్పాండెంట్ కె.ఎస్.వి.జి. శోభ, ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ కొమ్మారెడ్డి చైతన్య, హెచ్‌ఎం ఎన్. శ్రీనివాసరావు, ఉపాధ్యాయ బృందం ఘనంగా అభినందించారు.
