- కూటమి ధర్మాన్ని పాటిస్తూనే సమష్టిగా పనిచేసి విజయం సాధించాలి: ప్రభుత్వ చీఫ్ విప్ బొలిశెట్టి శ్రీనివాసరావు
- నూజివీడు చైర్మన్ పీఠం జనసేనకే దక్కేలా అధిష్టానానికి నివేదిస్తా: బొలిశెట్టి స్పష్టం
- జనసేన బలంగా ఉంది.. అత్యధిక వార్డుల్లో గెలుపే లక్ష్యం: సమన్వయకర్త బర్మా ఫణిబాబు
నూజివీడు:
రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జనసేన పార్టీ నూజివీడుపై ప్రత్యేక దృష్టి సారించింది. ఏలూరు జిల్లా మున్సిపల్ ఎన్నికల కోఆర్డినేటర్, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు నూజివీడు పట్టణంలో పార్టీ ముఖ్య నేతలు, సమన్వయకర్తలు, జనసైనికులతో విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా చీఫ్ విప్ బొలిశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన జెండాను రెపరెపలాడించడమే లక్ష్యంగా శ్రేణులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ పరిధిలో పార్టీకి పట్టున్న బలమైన వార్డులను గుర్తించాలని సూచించారు. మిత్రపక్షాలతో కలిసి కూటమి ధర్మాన్ని నిలబెట్టుకుంటూనే, సమష్టి కృషి ద్వారా అన్ని వార్డుల్లోనూ తిరుగులేని విజయం సాధించేలా సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. నూజివీడు మున్సిపల్ చైర్మన్ పదవి జనసేన పార్టీకి దక్కేలా పార్టీ అధిష్టానం వద్ద గట్టిగా ప్రతిపాదనలు ఉంచుతానని ఆయన స్పష్టం చేశారు.
నియోజకవర్గ సమన్వయకర్త బర్మా ఫణిబాబు మాట్లాడుతూ.. నూజివీడు నియోజకవర్గంలో జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో ఎంతో బలంగా ఉందని, ప్రజలు కూటమి పాలన పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. అర్హులైన, ప్రజాబలం ఉన్న నాయకులను బరిలోకి దించి అత్యధిక వార్డుల్లో జనసేన అభ్యర్థుల విజయానికి అహర్నిశలు కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఏలూరు జిల్లా మున్సిపల్ ఎన్నికల కోఆర్డినేషన్ టీమ్ సభ్యులు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
