రాష్ట్రాభివృద్ధికి ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగి ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
- కుటుంబ సభ్యులతో కలిసి ఉండవల్లి నివాసంలో గణనాథుడికి ప్రత్యేక పూజలు
- ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, తెలుగుజాతి వర్ధిల్లాలని ఆకాంక్ష
- ఐక్యతకు, సమష్టితత్వానికి ప్రతీక వినాయక చవితి: ముఖ్యమంత్రి
అమరావతి:
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి తమ నివాసంలో విఘ్నేశ్వరుడికి శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొనడం ఎంతో గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. గణపతి జ్ఞానానికి, వివేకానికి, విజయానికి ప్రతీక అని కొనియాడారు. ఏ శుభకార్యాన్ని తలపెట్టినా ముందుగా వినాయక పూజతో ప్రారంభించడం మన సనాతన సంప్రదాయమని గుర్తుచేశారు. విఘ్నాలను తొలగించి, సన్మార్గాన్ని చూపే వినాయక చవితి వేడుకలు సమాజంలో సామాజిక స్పృహను, సమష్టితత్వాన్ని, ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. వాడవాడలా మండపాలు ఏర్పాటు చేసుకుని ప్రజలంతా కలిసికట్టుగా జరుపుకునే ఈ ఉత్సవాలు మన సాంస్కృతిక వైభవానికి, ఆధ్యాత్మిక చైతన్యానికి నిలువెత్తు నిదర్శనమని అన్నారు.
ఆ వినాయకుడి దివ్య ఆశీస్సులతో రాష్ట్రంలోని ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు వెల్లివిరియాలని సీఎం ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి ఎదురయ్యే ఆటంకాలు, విఘ్నాలన్నీ తొలగిపోయి రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా సాగాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు జాతి సగర్వంగా వర్ధిల్లాలని ఆ విఘ్నేశ్వరుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆయన వినాయక చవితి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
