రచన: జన గళం బ్యూరో, పెడన/బంటుమిల్లి: కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ పరిధిలోని బంటుమిల్లి మండలంలో ఒక దళిత మహిళను ఉద్దేశించి స్థానిక తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు కూనపురెడ్డి వీరబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఒక మహిళపై అభ్యంతరకర పదజాలం ఉపయోగించడంతో పాటు, ఆమె వ్యక్తిగత విషయాలను బయటపెడతానంటూ బహిరంగంగా బెదిరింపులకు దిగడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామంపై పెడన నియోజకవర్గ నాయకుడు ఎస్.వి. బాబు సమ్మెట తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ బహిరంగ ప్రకటన విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎస్.వి. బాబు సమ్మెట మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలు ప్రజా సమస్యల ప్రాతిపదికన ఉండాలి తప్ప, మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా, బ్లాక్మెయిల్ చేసే ధోరణిలో ఉండకూడదని స్పష్టం చేశారు. వేదికపై దళిత మహిళను ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే పక్కనే ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఖండించకుండా మౌనంగా చూస్తూ నవ్వడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. మహిళా సాధికారత, గౌరవం గురించి మాట్లాడే కూటమి నేతలు క్షేత్రస్థాయిలో చోటుచేసుకుంటున్న ఇటువంటి ఘటనలపై ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. గతంలో సర్పంచ్‌గా పనిచేసిన సమయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వీరబాబుకు ఇతరుల వ్యక్తిగత విషయాలపై మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుందని ప్రశ్నించారు. ఈ ఘటనను టీడీపీ అధిష్ఠానం ఖండించి, సదరు నాయకుడిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, మహిళా లోకానికి సిట్టింగ్ ఎమ్మెల్యే బహిరంగంగా వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
