జన గళం అరకు/డుంబ్రిగూడ బ్యూరో: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని కూటమి నేతలు స్పష్టం చేశారు. డుంబ్రిగూడ మండలం, కితలంగి పంచాయతీ పరిధిలోని పాడి గ్రామం నుండి దూదుగూడ గ్రామం వరకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కల్యాణ్ “అడవితల్లి బాట” కార్యక్రమంలో భాగంగా మంజూరు చేసి, రికార్డు సమయంలో నిర్మాణం పూర్తి చేయించిన నూతన బీటీ రోడ్డును సోమవారం కూటమి నాయకులు అత్యంత ఘనంగా ప్రారంభించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) చైర్మన్, అరకు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ శ్రీ సివేరి దొన్ను దొర మరియు జనసేన పార్టీ అరకు ఇన్‌చార్జ్ శ్రీ చెట్టి చిరంజీవి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి రహదారిని లాంఛనంగా ప్రజా బాహుళ్యానికి అంకితం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి దశాబ్దాల తరబడి సరైన రవాణా వసతులు లేక గర్భిణులు, రోగులు డోలీ మోతలతో అవస్థలు పడ్డ గిరిజన గ్రామాలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ “అడవితల్లి బాట” పథకం ద్వారా శాశ్వత రోడ్డు సౌకర్యం కల్పించడం చారిత్రాత్మకమని కొనియాడారు. ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో ఏజెన్సీ పల్లెలకు వేగంగా మౌలిక వసతులు చేరుతున్నాయని, భవిష్యత్తులో మిగిలిన అన్ని మారుమూల ఆవాసాలకు కూడా పక్కా రోడ్లు నిర్మిస్తామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా రూరల్ సంయుక్త కార్యదర్శి బంగురు రామదాసు, నేతలు కొనేడి లక్ష్మణ్ రావు, డుంబ్రిగూడ మండల టీడీపీ అధ్యక్షుడు కిల్లో ఆనంద్, జనసేన మండల అధ్యక్షుడు సిదేరి దానేశ్వరావు, కితలంగి పంచాయతీ జనసేన అధ్యక్షులు కొర్ర రామ్మూర్తి, కె. శ్రీను, కె. చిన్న, పంచాయతీ ఇన్‌చార్జ్ బురిడి కోమటి, కిల్లో సిదేశ్వరంరావు, వి. కొండబాబు, పోర్తిమ్మ, చిమాద్రి, గురు, రామ్మూర్తి తదితర టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శ్రేణులు, పెద్ద సంఖ్యలో గిరిజనులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
