జన గళం ఎడ్యుకేషన్/యువజన డెస్క్: నేటి సమాజంలో యువతను శక్తివంతమైన నాయకులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రతిష్టాత్మక ‘ఐకాన్ యూత్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్’ (IKON Youth Leadership Programme – YLP) 9వ బ్యాచ్‌కు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియను అధికారికంగా ప్రారంభించారు. నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమాన్ని 3 రోజుల రెసిడెన్షియల్ శిక్షణగా నిర్వహించనున్నారు.
ఈ ప్రత్యేక శిక్షణా కార్యక్రమం అక్టోబర్ 30 నుండి నవంబర్ 1, 2026 వరకు హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్ పరిధిలో గల ‘బాల వికాస్’ (Bala Vikas) కేంద్రంలో జరగనుంది. ఈ శిక్షణ పూర్తిగా ఉచితం (100% Free of Cost) అని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులకు వసతి, భోజన సదుపాయాలతో పాటు అత్యుత్తమ నిపుణుల ద్వారా ప్రాక్టికల్ నాయకత్వ పాఠాలు, వ్యక్తిగత నైపుణ్యాల మెరుగుదలపై సమగ్ర శిక్షణ అందిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పరిమిత సీట్లు మాత్రమే ఉన్నందున ఆసక్తి గల యువతీ యువకులు వెంటనే అధికారిక వెబ్‌సైట్ (ityesh.org/Registrations) ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.
