జన గళం బిజినెస్ డెస్క్: భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీలకు సంబంధించి కీలక మార్పులు రానున్నాయి. దేశవ్యాప్తంగా యూపీఐ వ్యవస్థ నిర్వహణ ఖర్చులు, దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కొత్త మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం వచ్చే అక్టోబర్ 15 నుంచి రెండు వేల రూపాయలకు మించిన నిర్దిష్ట వ్యాపార (P2M) లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ వర్తించనుంది.
అయితే ఈ కొత్త నిబంధనల వల్ల సాధారణ వినియోగదారులపై ఎలాంటి అదనపు రుసుము భారం పడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యక్తిగత చెల్లింపులు (P2P) ఎప్పటిలాగే పూర్తిగా ఉచితంగా కొనసాగుతాయని, అలాగే రూ.2,000 వరకు జరిగే వ్యాపార చెల్లింపులపై కూడా ఎలాంటి ఎండీఆర్ ఛార్జీలు ఉండవని వెల్లడించింది. పెద్ద మొత్తంలో జరిగే వ్యాపార లావాదేవీలపై వర్తించే ఈ నిబంధనలు కేవలం డిజిటల్ చెల్లింపులను స్వీకరించే మర్చంట్స్‌కు మాత్రమే వర్తిస్తాయని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.
Slug: upi-payments-new-mdr-charges-october-15-relief-consumers
