జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: వైఎస్ఆర్ కడప జిల్లాలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత ప్రశాంతంగా, పారదర్శకంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం సర్వసన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐ.పి.ఎస్. అధ్యక్షతన పోలీసు అధికారులతో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల సన్నద్ధత, భద్రతా ఏర్పాట్లు మరియు ముందస్తు నివారణ చర్యలపై అధికారులకు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ, ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాలు, సున్నితమైన పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గతం లో అల్లర్లు, ఘర్షణలకు పాల్పడిన వ్యక్తులు, రౌడీషీటర్లు, అనుమానిత వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచి తక్షణ నివారణ చర్యలు (Preventive Measures) చేపట్టాలన్నారు. గ్రామాలలో విస్తృతంగా పర్యటిస్తూ గ్రామసభలు, కార్డన్ అండ్ సెర్చ్, పల్లె నిద్ర వంటి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పదే పదే నేరాలకు పాల్పడే వారిపై పీడీ (PD) యాక్ట్ అమలు చేయడంతో పాటు అవసరమైతే జిల్లా బహిష్కరణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
అక్రమ మద్యం, నగదు మరియు ఇతర ప్రలోభాల పంపిణీని పూర్తిగా అరికట్టాలని, అలాగే అక్రమ ఆయుధాల రవాణాను నిరోధించేందుకు విస్తృత తనిఖీలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. అంతర్ జిల్లా సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నిఘాను మరింత పటిష్టం చేసి, అత్యాధునిక సీసీ కెమెరాల వ్యవస్థను ఏర్పాటు చేయాలని.. వాటిని జిల్లా కేంద్రంలోని కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. గ్రామాల్లో రూట్ మార్చ్‌లు, ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహించడంతో పాటు డ్రోన్ కెమెరాలతో నిఘా కొనసాగించాలన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులపై సైబర్ నిఘా ఉంచాలని హెచ్చరించారు.
ప్రజలు ఎలాంటి భయాందోళనలు లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణాన్ని కల్పించడంలో పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) శ్రీ కె. ప్రకాష్ బాబు, ప్రొద్దుటూరు ఏఎస్‌పీ శ్రీ విబుకృష్ణ ఐ.పి.ఎస్., స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీ ఎన్. సుధాకర్, మైదుకూరు డీఎస్పీ శ్రీ రాజేంద్రప్రసాద్, పులివెందుల డీఎస్పీ శ్రీ మురళి నాయక్, జమ్మలమడుగు డీఎస్పీ శ్రీ కే. వెంకటేశ్వర రావుతో పాటు జిల్లాలోని వివిధ సర్కిళ్ల సీఐలు, ఎస్ఐలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Slug: kadapa-district-police-sp-shelke-nachiketh-vishwanath-local-body-elections-review
