జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాసేవలో విజయవంతంగా రెండున్నర దశాబ్దాలు పూర్తి చేసుకున్న చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో ఘన వేడుకలు నిర్వహించారు. పమిడిముక్కల మండలంలోని అగినపర్రు గ్రామం నుండి హనుమంతపురం గ్రామం వరకు కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఉత్సాహభరిత వాతావరణంలో ‘సేవజ్యోతి యాత్ర’ పేరుతో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. మోదీ పాలనా దశాబ్దాల ప్రస్థానాన్ని కొనియాడుతూ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ బైక్ ర్యాలీలో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ ప్రత్యేక కార్యక్రమానికి పామర్రు శాసనసభ్యులు శ్రీ వర్ల కుమార్ రాజా మరియు జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ తాడిశెట్టి నరేష్ ముఖ్య అతిథులుగా విచ్చేసి స్వయంగా కాగడాలు వెలిగించి సేవజ్యోతి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గుజరాత్ ముఖ్యమంత్రి స్థాయి నుంచి దేశ ప్రధాని వరకు మోదీ సాగించిన 25 ఏళ్ల ప్రస్థానం దేశ రాజకీయ చరిత్రలోనే అత్యంత స్ఫూర్తిదాయకమని కొనియాడారు. నిస్వార్థ ప్రజాసేవ, దేశ సమైక్యత, మరియు సంక్షేమానికి ఆయన ఇస్తున్న ప్రాధాన్యత ప్రపంచ దేశాల మన్ననలను పొందుతోందని తెలిపారు.
అగినపర్రు నుంచి హనుమంతపురం వరకు సాగిన ఈ బైక్ ర్యాలీ దారి పొడవునా కూటమి శ్రేణులు దేశభక్తి నినాదాలతో హోరెత్తించాయి. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల సీనియర్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు యువకులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకుపోతోందని, ఆయన సేవలను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ సేవజ్యోతి యాత్ర విజయవంతం కావడం పట్ల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
Slug: pamidimukkala-sevajyothi-yatra-modi-25-years-bike-rally-varla-kumar-raja
