జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: విజయవాడ నగరంలో సహకార రంగంలో సేవలందిస్తున్న ప్రముఖ సంస్థ ‘ది సిటిజన్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్’ ఆధ్వర్యంలో విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రత్యేక అభినందన సభ అత్యంత వైభవంగా నిర్వహించబడింది. నగరంలోని సత్యనారాయణపురం, భవానీపురం, ఆటోనగర్ మరియు ప్రధాన బ్రాంచ్‌లతో పాటు నిర్మల కాన్వెంట్ రోడ్ బ్రాంచ్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ఇటీవల విడుదలైన పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలలో తొంబై ఐదు శాతం అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులను ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమానికి సొసైటీ డైరెక్టర్ ఎం.బి. రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు నగదు బహుమతులు మరియు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తమ విజయానికి అండగా నిలిచిన తల్లిదండ్రులకు మరియు సొసైటీకి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఆరు రాష్ట్రాల పరిధిలో విస్తరించిన సొసైటీ బ్రాంచ్‌ల ద్వారా విద్యారంగానికి, సామాజిక సేవా కార్యక్రమాలకు తమవంతు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు.
ఆరు రాష్ట్రాల పరిధిలోగల నలభై ఆరు బ్రాంచ్‌ల నుండి మొత్తం రెండు వందల తొంబై ఇద్దరు విద్యార్థులు ప్రతిభ కనబరచగా, విజయవాడలోని నాలుగు బ్రాంచ్‌ల పరిధి నుండి పద్నాలుగు మంది విద్యార్థులు ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అతిథుల చేతుల మీదుగా నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందుకున్న విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని విజేతలను అభినందించడంతో పాటు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Slug: vijayawada-citizen-cooperative-society-student-felicitation
