జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: రాష్ట్రాన్ని పచ్చదనంతో సస్యశ్యామలమైన గ్రీన్ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ కొణిదెల నాగబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో యాభై శాతం గ్రీన్ కవర్ సాధించాలనే బృహత్తర లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్న తరుణంలో, తూర్పుగోదావరి జిల్లా కడియపులంకలో సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ రైతులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టనున్న భారీ స్థాయి మొక్కల పెంపకం, సేకరణ కార్యక్రమాలపై నర్సరీ రైతులతో విస్తృతంగా చర్చించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో సుమారు పది కోట్ల మొక్కలను నర్సరీల్లో సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ భారీ లక్ష్యాన్ని సాధించడానికి కడియం నర్సరీ రైతులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరి సహకారం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, రహదారులు మరియు ఖాళీ స్థలాలలో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోందని చెప్పారు. నర్సరీ రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా తగిన మార్కెట్ అవకాశాలు కల్పించడంతో పాటు ప్రభుత్వ హరిత కార్యక్రమాల్లో వారిని భాగస్వామ్యం చేస్తామని హామీనిచ్చారు.
కడియపులంక పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరంలోని గోదావరి మహాపుష్కర నగరవనాన్ని నాగబాబు సందర్శించి అక్కడ జరుగుతున్న మొక్కల పెంపకం, వన సంరక్షణ చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా నగరవనంలో రుద్రాక్ష మొక్కలతో పాటు అత్యంత అరుదైన అండమాన్ పడాక్ మొక్కలను ఆయన స్వయంగా నాటారు. అనంతరం శ్రీ సత్యదేవ నర్సరీతో పాటు పలు నర్సరీలను పరిశీలించి, మొక్కల నాణ్యత, ధరలు, ఉత్పత్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతుల కోరిక మేరకు అరుదైన బ్లాక్ వేప మొక్కను నాటి, నర్సరీల్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందితో ముచ్చటించి వారి ఉపాధి వివరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ గ్రీన్ కమిషనర్, సీఈవో బిఎన్ఎన్ మూర్తి, డీఎఫ్‌ఓ ప్రభాకరరావు తదితర అధికారులు పాల్గొన్నారు.
Slug: kadiyam-nurseries-green-ap-nagababu-visit-tour
