జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా జరిగిన దురదృష్టకర సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన యువ కార్యకర్త కుటుంబానికి జనసేన పార్టీ భరోసాగా నిలిచింది. అమలాపురం నియోజకవర్గం బెండమూరులంక గ్రామానికి చెందిన జనసైనికుడు రోళ్ళ ప్రేమ్ కుమార్.. పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పార్టీ కోసం ప్రాణాలర్పించిన సైనికుడి కుటుంబాన్ని ఆదుకునేందుకు జనసేన నాయకులు ముందుకొచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు.
బాధిత కుటుంబానికి జనసేన పార్టీ తరఫున మొత్తం రూ. 3 లక్షల ఆర్థిక సహాయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్లూరి రామ్ గారి చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ విపత్కర సమయంలో ప్రేమ్ కుమార్ కుటుంబాన్ని ఆదుకునేందుకు పలువురు నాయకులు, శ్రేయోభిలాషులు స్వచ్ఛందంగా ముందుకు రావడం విశేషం. ఈ ఆర్థిక సహాయంలో అమెరికాకు చెందిన ఎన్‌ఆర్‌ఐ (NRI) జనసైనికుడు రూ. 2 లక్షలు అందించగా, భీమిలి నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీ పంచకర్ల సందీప్ రూ. 50 వేలు, రామచంద్రాపురం నియోజకవర్గానికి చెందిన శ్రీ డేగల నాగేంద్ర రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.
ఈ సందర్భంగా రోళ్ళ ప్రేమ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేన నాయకులు వారికి తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపం తెలియజేశారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా కష్టకాలంలో ఉన్న కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవడమే తమ బాధ్యత అని స్పష్టం చేశారు. జనసేన పార్టీ ఎల్లప్పుడూ ప్రేమ్ కుమార్ కుటుంబానికి అండగా ఉంటుందని, అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా కల్పించారు.
Slug: janasena-financial-assistance-prem-kumar-family-amalapuram
