జన గళం బంటుమిల్లి/కృష్ణా బ్యూరో: న్యాయవాదుల వృత్తిపరమైన రక్షణ, భద్రత కోసం ప్రతిపాదిత ‘అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్’ (న్యాయవాదుల రక్షణ చట్టం)ను ప్రభుత్వం తక్షణమే చట్టసభల్లో ఆమోదించి పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బంటుమిల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. స్థానిక కోర్టు ప్రాంగణం వద్ద శాంతియుతంగా ప్రారంభమైన ఈ దీక్షలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ.. సమాజంలో ప్రజలకు న్యాయం అందించేందుకు నిరంతరం శ్రమిస్తున్న న్యాయవాదులపై ఇటీవల దాడులు, బెదిరింపులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవాదులు ఎలాంటి భయభ్రాంతులకు గురికాకుండా తమ కర్తవ్యాన్ని నిర్భయంగా నిర్వర్తించాలంటే రక్షణ చట్టం తప్పనిసరి అని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఈ చట్టాన్ని వెంటనే తీసుకురావాలని, లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
