జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ప్రతి ఇంటికీ రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్‌ను చేరువ చేసి, ప్రజలపై విద్యుత్ బిల్లుల భారాన్ని గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ను అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని మైలవరం శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ‘సేవా సేతు అభియాన్’ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ సౌర విద్యుత్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన ఈ అభియాన్‌ను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థల ఏర్పాటుకు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, ఆన్లైన్ దరఖాస్తు విధానం, ప్రభుత్వ అందిస్తున్న సబ్సిడీలు మరియు బ్యాంకు రుణ సదుపాయాలపై ఈ శిబిరంలో స్పష్టమైన మార్గదర్శకత్వం అందిస్తున్నట్లు తెలిపారు. ఇళ్లపై సోలార్ ప్యానెళ్లను అమర్చుకోవడం వల్ల సంప్రదాయ విద్యుత్‌పై ఆధారపడటం తగ్గి, విద్యుత్ బిల్లుల భారం నుంచి శాశ్వత ఉపశమనం లభిస్తుందన్నారు. స్వచ్ఛమైన పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కూడా ఎంతో దోహదపడుతుందని వివరించారు.
పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనకు సంబంధించి ‘సేవా సేతు అభియాన్’ కార్యక్రమం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు కొనసాగుతుందని, ప్రజలు తమ సమీపంలోని శిబిరాలను సంప్రదించి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌ఛార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), టీడీపీ సీనియర్ నేత బొమ్మసాని సుబ్బారావు, ఇతర కూటమి నాయకులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Slug: gollapudi-pm-surya-ghar-seva-setu-vasantha-krishna-prasad
