జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుదీర్ఘ ఇరవై ఐదేళ్ల ప్రజా జీవితంలో ప్రజలకు ఇచ్చిన హామీలకు, వాటి ఆచరణకు మధ్య తీవ్రమైన వ్యత్యాసం ఉందని విజయవాడ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్‌ఛార్జి భార్గవ్ వల్లూరు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆయన కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును ఎండగట్టారు. ప్రతి ఎన్నికకూ సరికొత్త జుమ్లాలు చెప్పడం, ప్రతి హామీకి కొత్త గడువులు విధించడం తప్ప ఆచరణలో మాత్రం శూన్యమని ఆయన విమర్శించారు.
దేశ ప్రజలకు ఇచ్చిన అనేక ప్రధాన హామీల అమలు తీరుపై కేంద్ర ప్రభుత్వం పూర్తి వివరాలతో లెక్కలు చెప్పాలని భార్గవ్ వల్లూరు డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు జమ చేస్తామనడం, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామనడం, విదేశాల నుంచి నల్లధనాన్ని వెనక్కి తీసుకువస్తామనడం వంటి హామీల అమలుపై స్పష్టత ఇవ్వాలని కోరారు. అలాగే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, అయిదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధిస్తామని, నూట స్మార్ట్ సిటీలు నిర్మిస్తామని చెప్పిన మాటలు నెరవేరలేదని ఆయన మండిపడ్డారు.
దేశంలో పెరుగుతున్న జీవన వ్యయాలు, ఉపాధి లేమి, నిరుద్యోగ సమస్యలు మరియు రైతుల కష్టాలపై కేంద్రం బాధ్యత వహించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. కేవలం ప్రచార ఆర్భాటాలతో కాలం వెళ్లదీయడం మాని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని హితవు పలికారు. రైతన్నలకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధర కల్పించడం, కశ్మీరీ పండిట్ల పునరావాసం వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించాలని కోరారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం సాగిస్తుందని భార్గవ్ వల్లూరు స్పష్టం చేశారు.
Slug: vijayawada-congress-leader-bhargav-valluru-criticizes-modi-governance-25-years
