జన గళం మంగళగిరి బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సన్నాహక కసరత్తును ముమ్మరం చేశారు. రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించేందుకు కోఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రతి పార్లమెంటరీ అడ్హాక్ కమిటీలో ముగ్గురు పార్లమెంట్ స్థాయి నేతలు, అసెంబ్లీ నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున నాయకులను నియమించనున్నారు. వారికి సహకరించేందుకు ప్రత్యేక నిర్వహాక్ దళ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు.
విజయవాడ పార్లమెంట్ మినహా మిగతా పార్లమెంట్ కమిటీలను ప్రకటించాలని నిర్ణయించారు. నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, నంద్యాల నియోజకవర్గాలను పవన్ కళ్యాణ్ సెంట్రల్ సపోర్ట్ టీమ్ ద్వారా స్వయంగా పర్యవేక్షించనున్నారు. ఈ కమిటీలు సేకరించే క్షేత్రస్థాయి నివేదికలను ఐదుగురు సభ్యుల కేంద్ర కమిటీ సమీక్షించి అధినేతకు అందజేస్తుంది. త్వరలోనే పార్లమెంట్ వారీగా అడ్హాక్ కమిటీలతో పవన్ కళ్యాణ్ స్వయంగా సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు. వీటితో పాటు ఎన్నికల నిర్వహణ & మార్గదర్శక కమిటీ, కూటమి సమన్వయ కమిటీ, ప్రచార కమిటీ, ట్రెజరీ కమిటీలను నియమించారు. ఈ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి రామ్, చిల్లపల్లి శ్రీనివాసరావు, పెండెం దొరబాబు, వంశీకృష్ణ యాదవ్, పీవీఆర్ ప్రశాంత్, యనమల భాస్కర్, కళ్యాణం శివ శ్రీనివాసరావు (కేకే) పాల్గొన్నారు.
