జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల నుంచి కోట్లాది ఓట్లు తొలగించారనే ఆరోపణలపై తీవ్ర నిరసన వ్యక్స్తూ, జాతీయ ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన చలో లోక్‌భవన్ కార్యక్రమం విజయవాడలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ లెనిన్ సెంటర్ వద్దకు చేరుకున్న విద్యార్థి, యువజన సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకుని ముందస్తుగా అరెస్టు చేశారు. అనంతరం వారిని తదుపరి చర్యల నిమిత్తం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఏఐఎస్ఏ, ఏఐఎస్పీ, ఏఐవైఎఫ్ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను కాపాడాలని, అర్హులైన ప్రతి పౌరుడి ఓటు హక్కును పరిరక్షించాలని నాయకులు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఏఐఎస్పీ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి నగిరిమడుగు కిరణ్ కుమార్, కడప జిల్లా అధ్యక్షులు సిదిగే దినేష్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలపై అనేక అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ఎస్‌ఐఆర్ పేరుతో దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్ల ఓట్లు తొలగించారనే ఆరోపణలపై ఎన్నికల కమిషన్ ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభం లాంటిదని, అర్హులైన పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకోలేని పరిస్థితులు ఏర్పడితే ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసం పూర్తిగా దెబ్బతింటుందని పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ, ఎన్నికల వ్యవస్థ నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన రాజ్యాంగబద్ధ బాధ్యతను విస్మరిస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు.
ఎన్నికల కమిషన్ స్వతంత్రతను కాపాడాలని, ఓటర్ల జాబితాల రూపకల్పనలో పూర్తి పారదర్శకత పాటించాలని, ఓటర్ల తొలగింపునకు సంబంధించిన వివరాలను తక్షణమే బహిర్గతం చేయాలని వారు డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు బయలుదేరిన తమను పోలీసులు అరెస్టు చేసి నిర్బంధించడం ప్రజాస్వామ్య హక్కులపై ఆంక్షలు విధించడమేనని విమర్శించారు. అరెస్టులు, నిర్బంధాలతో ప్రజాస్వామ్య ఉద్యమాలను ఎప్పటికీ అణచివేయలేమని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకు, ప్రజల ఓటు హక్కును పరిరక్షించే వరకు తమ పోరాటాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.
Slug: vijayawada-chalo-lok-bhavan-protest-aisp-aiyf-arrests
