జన గళం ఆధ్యాత్మిక డెస్క్: విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల కవరేజ్ కోసం దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టులకు అధికారులు పరిమితంగా పాస్‌లు కేటాయించడం తీవ్ర దుమారానికి దారితీసింది. మీడియా పాస్‌ల జారీ విషయంలో అధికారులు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని, నియంతృత్వ ధోరణిని నిరసిస్తూ ఉదయం నుంచి జర్నలిస్టులు ఘాట్ రోడ్ వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. ఉత్సవాల ఏర్పాట్లపై ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించినప్పటికీ, నిన్న రాత్రి హడావిడిగా అరకొరగా పాస్‌లు జారీ చేయడం పట్ల జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం మీడియా పాయింట్ వరకే అనుమతిస్తామనే నిబంధనలు పెట్టడంపై వారు మండిపడ్డారు.
లక్షలాది మంది భక్తులు తరలివచ్చే మహా ఉత్సవాలలో క్యూలైన్లలో భక్తులు పడే ఇబ్బందులను, లోటుపాట్లను క్షేత్రస్థాయిలో కవరేజ్ చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని జర్నలిస్టులు ఆరోపించారు. దశాబ్దాలుగా లేని నిబంధనలను ఇప్పుడే తెరపైకి తీసుకువచ్చి పత్రికా స్వేచ్ఛను అణచివేయాలని చూస్తున్నారని విమర్శించారు. అధికారుల తీరుపై నిరసనగా ఉత్సవాల కవరేజ్‌ను పూర్తిగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఉదయం నుంచి ఘాట్ రోడ్ వద్ద ఆందోళన చేస్తున్నప్పటికీ కనీసం ఏ ఒక్క అధికారి కూడా అటువైపు వచ్చి సమస్యను పట్టించుకోకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
అధికారులు స్పందించి సరైన వివరణ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని జర్నలిస్టులు స్పష్టం చేశారు. భక్తుల కష్టాలను, అసౌకర్యాలను బయటపెట్టకుండా ఉద్దేశపూర్వకంగానే ఆంక్షలు విధిస్తున్నారని ధ్వజమెత్తారు. మీడియాను కట్టడి చేయడం ద్వారా ఆలయ నిర్వహణలో ఉన్న లోపాలను కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. అధికారుల ఏకపక్ష నిర్ణయాలు వెనక్కి తీసుకునే వరకు, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు పూర్తిస్థాయి పాస్‌లు కేటాయించే వరకు నిరసన కొనసాగుతుందని హెచ్చరించారు.
Slug: vijayawada-indrakeeladri-dasara-media-passes-protest-journalists
