జన గళం ఆధ్యాత్మిక డెస్క్: కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ కొండాలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక శోభ నడుమ నిర్వహించిన ఈ వేడుకలకు గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము ముఖ్య అతిథిగా హాజరై ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే రాముకు దేవాదాయ శాఖ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు.
ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, నిర్ణీత ముహూర్తానికి వేదమంత్రాల నడుమ కలశ స్థాపన చేశారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో గుడివాడ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఎమ్మెల్యే రాముకు వేద ఆశీర్వచనాలు అందజేయగా, ఆలయ సంప్రదాయం ప్రకారం అమ్మవారి శేష వస్త్రాలు, చిత్రపటం మరియు లడ్డూ ప్రసాదాన్ని నిర్వాహకులు అందజేశారు.
శరన్నవరాత్రి మహోత్సవాల ప్రారంభ వేడుకల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సీజీఎఫ్ (కామన్ గుడ్ ఫండ్) నిధులతో నూతనంగా నిర్మించిన కాలక్షేప మండప భవనాన్ని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రారంభించారు. భక్తులకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ధార్మిక సమావేశాలు నిర్వహించుకునేందుకు ఈ మండపం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, గుడ్లవల్లేరు మండల టీడీపీ నాయకులు పోలవరపు వెంకటరావు, కొండలమ్మ గుడి చైర్మన్ ఈడే మోహన్, ఈవో ఆకుల కొండలరావు, కూటమి పార్టీల నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Slug: gudlavalleru-vemavaram-kondalamma-temple-dasara-navaratri-mla-venigandla-ramu
