జన గళం క్రీడా డెస్క్: వయసు మీదపడుతున్నా క్రీడలపై ఆయనకున్న ఆసక్తి తగ్గలేదు. 74 ఏళ్ల వయసులోనూ యువ క్రీడాకారులకు టెన్నిస్‌లో శిక్షణ అందిస్తూ వారి విజయాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు డా. సింగంశెట్టి దుర్గకుమార్. ఆయన శిక్షణలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్రీడాకారిణి తలశిల లలిత జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం విశేషం.
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య కోచ్‌గా, సీనియర్ జర్నలిస్టుగా, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ మాజీ ప్రధాన కన్వీనర్‌గా డా. దుర్గకుమార్ క్రీడారంగానికి విశేష సేవలందించారు. టెన్నిస్ శిక్షణను మరింత సులభతరం చేసేందుకు బంతులను సేకరించే పరికరం, బంతులను విసిరే యంత్రం వంటి వినూత్న సాధనాలను రూపొందించారు. టెన్నిస్ ఆటను సామాన్యులకు, యువ క్రీడాకారులకు చేరువ చేయాలనే లక్ష్యంతో తెలుగులో ‘హౌ టు ప్లే టెన్నిస్’ అనే మార్గదర్శక పుస్తకాన్ని రచించారు. వ్యక్తిగతంగా అత్యధిక టెన్నిస్ టోర్నమెంట్లు నిర్వహించిన ఘనత కూడా ఆయనకు ఉంది.
దుర్గకుమార్ శిక్షణలో తలశిల లలిత అండర్-17 విభాగంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ పోటీలకు ఆంధ్రప్రదేశ్ తరఫున ఎంపికైంది. అలాగే పి.వి. సుక్తి శ్రీ, పి. లాస్య ప్రియ అండర్-14 ప్రాంతీయ టెన్నిస్ టోర్నమెంట్లలో వరుసగా మొదటి, రెండో స్థానాలు సాధించారు. యువ క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని పెంపొందిస్తూ వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో దుర్గకుమార్ శిక్షణ కీలకంగా నిలుస్తోంది.
అక్టోబర్ 23 నుంచి 28 వరకు న్యూఢిల్లీలో జరగనున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ పోటీల్లో పాల్గొననున్న తలశిల లలితకు నరసరావుపేటకు చెందిన డా. పి. శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు. దుర్గకుమార్ కృషిని అభినందిస్తూ, యువ క్రీడాకారులను తీర్చిదిద్దడంలో ఆయన సేవలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
