జన గళం ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీ-ఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్రిచ్మెంట్ చైర్మన్, శాసన మండలి సభ్యులు కొణిదల నాగబాబు కృష్ణా జిల్లా అవనిగడ్డలో స్థానిక శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ స్వగృహానికి విచ్చేశారు. ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్న నాగబాబుకు బుద్ధప్రసాద్, విజయలక్ష్మి దంపతులతో పాటు జనసేన మచిలీపట్నం పార్లమెంట్ సమన్వయకర్త మండలి వెంకట్రామ్ సాదరంగా స్వాగతం పలికి తేనీటి విందు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కొణిదల నాగబాబు కాసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. ఉభయులూ గత అనుభవాలు, పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ నియోజకవర్గ పరిధిలోని తాజా పరిస్థితులపై చర్చించారు. అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో సాగిన ఈ మర్యాదపూర్వక భేటీ ఇరు కుటుంబాల మధ్య ఉన్న సత్సంబంధాలను ప్రతిబింబించింది.
