జన గళం క్రైమ్ డెస్క్: విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో గతంలో సంచలనం సృష్టించిన తోట సాయికృష్ణ లాకప్ డెత్ (కస్టోడియల్ డెత్) కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అత్యంత కీలకమైన సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థకు (సీబీఐ) అప్పగిస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ అధికారులు వెంటనే ఈ కేసు దర్యాప్తును తమ చేతుల్లోకి తీసుకుని సమగ్ర విచారణ చేపట్టాలని స్పష్టం చేసింది.
పోలీసుల వేధింపులతో ప్రాణాలు కోల్పోయిన సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి రూ. 25 లక్షల ఆర్థిక పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈ పరిహారాన్ని రాబోయే 4 వారాల్లోగా బాధితురాలికి అందజేయాలని తేల్చిచెప్పింది. స్థానిక పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదని, తన కుమారుడి మరణంపై నిష్పాక్షిక విచారణ జరిపించేందుకు కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ పూర్తి చేసిన హైకోర్టు ఈ మేరకు తుది ఉత్తర్వులు వెలువరించింది. ఈ తీర్పుతో బాధితురాలికి న్యాయం జరిగే దిశగా ముందడుగు పడిందని న్యాయవాదులు పేర్కొంటున్నారు.
