పార్లమెంట్, అసెంబ్లీ సమన్వయకర్తలతో విస్తృత స్థాయి సమీక్ష
జన గళం బ్యూరో, మచిలీపట్నం: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భాగస్వామ్య పక్షాలు సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించే దిశగా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాయి. మచిలీపట్నం ఎంపీ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం స్థానిక సంస్థల ఎన్నికల పార్లమెంట్ కో-ఆర్డినేషన్, ప్రచార కమిటీ సభ్యులు మరియు మచిలీపట్నం ఎంపీ శ్రీ వల్లభనేని బాలశౌరి గారి నేతృత్వంలో పెనమలూరు నియోజకవర్గ సన్నద్ధతపై విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పెనమలూరు శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్ గారు పాల్గొని క్షేత్రస్థాయి ఎన్నికల కసరత్తుపై చర్చించారు.
పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని పంచాయతీలు, వార్డులు, మండల పరిషత్ స్థానాల్లో కూటమి అభ్యర్థుల ఎంపిక, ప్రచార కార్యాచరణ మరియు బూత్ స్థాయి సమన్వయంపై నాయకత్వం కూలంకషంగా సమీక్షించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ వివరించాలని, స్థానిక సంస్థల సమరంలో కూటమికి తిరుగులేని మెజారిటీ దక్కేలా ప్రతి కార్యకర్త బాధ్యతగా పనిచేయాలని ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సూచించారు.
ఈ సమావేశంలో మచిలీపట్నం పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల కో-ఆర్డినేషన్ కమిటీ సమన్వయకర్తలు శ్రీ మండలి వెంకట రామ్, శ్రీ బండి రామకృష్ణ, శ్రీ చిలకలపూడి పాపారావు, శ్రీమతి డాక్టర్ మాధవిలతో పాటు పెనమలూరు అసెంబ్లీ సమన్వయకర్తలు శ్రీ నెరుసు కృష్ణంజనేయులు, శ్రీ బొల్లం వీరన్ కుమార్, శ్రీ వడ్డీ జీవరత్నం తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో క్షేత్రస్థాయి సమీకరణాలు, సామాజిక ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక వివరాలను వారు నాయకత్వానికి వివరించారు.
,l
